: ఐలవ్ వైట్ హౌస్... వైట్ హౌస్ ని చెత్తతో పోల్చలేదు: ట్రంప్ వివరణ
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధాన్ని ఆ దేశాధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చెత్తకుండీ (డంప్) తో పోల్చారంటూ వస్తున్న వార్తలను ఖండిస్తూ ఆయన వివరణ ఇచ్చారు. ‘ట్రంప్ తరచుగా న్యూజెర్సీలోని బెడ్ మినిస్టర్ లో గల తన గోల్ఫ్ క్లబ్ కు వెళ్తుంటారు. అందుకు గల కారణాన్ని తన సహచరులకు వివరిస్తూ, వైట్ హౌస్ ఓ డంప్ లాగా ఉంటుంది. అందుకే తరచూ ఇక్కడికి వస్తుంటానని ట్రంప్ అన్నార’ని ఇటీవల ఒక కథనం వెలువడింది. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
దీంతో వెంటనే ట్రంప్ వివరణ ఇస్తూ, వైట్ హౌస్ అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. తాను చూసిన భవనాల్లో శ్వేతసౌధం చాలా అందమైనదని అన్నారు. కానీ నకిలీ మీడియా తాను దానిని డంప్ అన్నట్టు చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైట్ హౌస్ ను డంప్ అన్న వార్త వైరల్ అయిన వెంటనే అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కుమార్తె చెల్సియా క్లింటన్ ట్విట్టర్ ద్వారా ‘వైట్ హౌస్ లో పనిచేస్తున్న ఉషర్స్, బట్లర్స్, పనిమనుషులు, వంటవాళ్లు, తోటమాలి, ప్లంబర్, ఇంజినీర్, క్యురేటర్ అందరికీ కృతజ్ఞతలు. ప్రతిరోజూ మీరు చేస్తున్న పనికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ఇది కూడా వైరల్ అయింది. ప్రస్తుతం అమెరికాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.