: ఐసీయూలోనే దిలీప్ కుమార్.. పరిస్థితి మెరుగుపడలేదన్న వైద్యులు!


బాలీవుడ్ నిన్నటి తరం సూపర్ స్టార్ దిలీప్ కుమార్ (94) ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు.  మూత్ర సమస్యలు, డీహైడ్రేష‌న్‌తో బాధపడుతున్న ఆయనను బుధవారం ముంబై, బాంద్రాలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు.  ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్టు ఆసుపత్రి వైస్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ పాండే తెలిపారు. ఇప్పటి వరకు డయాలసిస్ ప్రారంభించలేదన్నారు. దిలీప్ కుమార్ కిడ్నీల పనితీరు సాధారణ స్థితికి చేరుకోవాల్సి ఉందన్నారు. ఆయన పరిస్థితిని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకున్నా, విషమంగా అయితే లేదన్నారు.  

మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఏమాత్రం మెరుగుదల లేదని, క్రియాటినిన్ స్థాయులు బాగా పెరిగిపోయాయని తెలుస్తోంది. కిడ్నీల పనితీరు మరింత క్షీణిస్తే దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత విషమంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఆసుపత్రిలో చేరినప్పటి కంటే ఆయన పరిస్థితి కొంత మెరుగుపడిందని ఆయన సతీమణి సైరా బాను పేర్కొన్నారు. దిలీప్ కుమార్ ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి బాలీవుడ్ ఆందోళన చెందుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటోంది.

  • Loading...

More Telugu News