: ‘మెట్రో’ పనులు.. అమీర్‌పేటలో 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్ లోని మైత్రివనం వద్ద మెట్రో రైల్ కారిడార్, ఇంటర్ చేంజ్ స్టేషన్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అమీర్ పేట, మైత్రివనం జంక్షన్ మీదుగా వెళ్లే వాహనాల రాకపోకలపై 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎర్రగడ్డ, ఎన్ఆర్ నగర్ మీదుగా అమీర్ పేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలతో పాటు ఎస్ఆర్ నగర్, మైత్రివనం మీదుగా మధురానగర్, కల్యాణ్ నగర్ వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు.
* ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు.. ఎస్ఆర్ నగర్ లోని ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి ఎడమవైపు తిరిగి, పోలీస్ స్టేషన్, టి-జంక్షన్, సత్యం థియేటర్, కనకదుర్గ గుడి, గ్రీన్ ల్యాండ్స్ మీదుగా బేగంపేట వైపు వెళ్లనున్నాయి.
* పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు... ఎస్ఆర్ నగర్ లోని ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి ఎడమవైపు వెళ్లి పోలీస్ స్టేషన్, టి-జంక్షన్, సత్యం థియేటర్ చౌరస్తా నుంచి కుడివైపునకు తిరిగి మైత్రివనం చేరుకుని, అక్కడి నుంచి అమీర్ పేట ప్రధాన రహదారి మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది.
* ఎస్ఆర్ నగర్ లోని ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్, టి-జంక్షన్, సత్యం థియేటర్, కనకదుర్గ ఆలయం వరకు వన్ వే గా నిర్ణయించారు.
* ఫతేనగర్ వైపు నుంచి ఎస్ఆర్ నగర్ మీదుగా అమీర్ పేట వైపు వెళ్లే వాహనాలను సత్యం థియేటర్ మీదుగా అనుమతించరు. ఆర్ అండ్ బి కార్యాలయం నుంచి ఎడమవైపునకు తిరిగి డీకే రోడ్డు మీదుగా బల్కంపేట్ రోడ్, జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
* ఎర్రగడ్డ వైపు నుంచి మధురానగర్, కల్యాణ్ నగర్ వైపు వెళ్లే ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు.. ఎస్ఆర్ నగర్ లోని ఉమేష్ చంద్ర విగ్రహం నుంచి కుడివైపునకు తిరగాలి. అదే, భారీ వాహనాలు అయితే ఎస్ఆర్ నగర్ టి-జంక్షన్, సత్యం థియేటర్, దుర్గగుడి మీదుగా అమీర్ పేట చౌరస్తా నుంచి వెళ్లాలి. జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్, అమీర్ పేట నుంచి సోనాబాయి ఆలయం వరకు వన్ వే చేశారు.
* సికింద్రాబాద్, బేగంపేట నుంచి సోనాబాయి ఆలయం మీదుగా వాహనాలను అనుమతించరు
* సికింద్రాబాద్, బేగంపేట నుంచి ఎస్ఆర్ నగర్, యూసుఫ్ గూడ వైపు వెళ్లే వాహనాలను సత్యం థియేటర్ మీదుగా కాకుండా,
దుర్గగుడి మీదుగా మైత్రీవనం జంక్షన్ కు మళ్లించారు.