: దేశంలో మొదటి మహిళా ఫైర్ ఫైటర్... హర్షిణి కన్హేకర్!
ఐదేళ్ల పాటు బాలికల కళాశాలలో చదివి, మొదటిసారిగా మొత్తం అబ్బాయిలే ఉండే నాగ్‌పూర్‌లోని నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో అడుగుపెట్టింది హర్షిణి కన్హేకర్. `ఈ రంగం ఎందుకు ఎంచుకున్నావ్?`, `అమ్మాయివి కదా, ఎలా మనగలుగుతావ్?` అంటూ అడుగడుగునా వినిపించే ప్రశ్నలతో ఆమె సతమతమైంది. అయినా స్థైర్యాన్ని కోల్పోకుండా కష్టపడింది. ఏరోజు కూడా శిక్షణకు ఆలస్యంగా వెళ్లలేదు. మగవాళ్లకు దీటుగా డ్రిల్స్ చేసింది. చివరకు ఏడు సెమిస్టర్లు విజయవంతంగా పూర్తి చేసి మొదటి మహిళా ఫైర్ ఫైటర్‌గా క్యాంపస్ నుంచి బయటికొచ్చింది.
`2002 వరకు ఆ క్యాంపస్‌లో బాలికలు లేరు. నేనే మొదటిదాన్ని అవడంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి వచ్చింది. నేను కనపడగానే అందరూ నా గురించే మాట్లాడుకునేవారు. అందరూ ఏదో ఒక సలహా ఇచ్చేవారు. వాటిలో కొన్ని ప్రోత్సాహకరంగా ఉండేవి, మరికొన్ని నిరుత్సాహపరిచేవి.` అంటూ హర్షిణి చెప్పుకొచ్చారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మొదటి మహిళా పైలట్‌గా ఎదిగిన శివాని కులకర్ణి తనకు ఆదర్శమని హర్షిణి తెలిపారు. ప్రస్తుతం ఫైర్ ఫైటర్‌గా తన వృత్తి చాలా సంతృప్తికరంగా ఉందని ఆమె వివరించారు. మంటల్లో చిక్కుకున్న వారిని కష్టపడి కాపాడినపుడు వాళ్ల కళ్లలో కనిపించే కృతజ్ఞతను మాటల్లో చెప్పలేమని హర్షిణి అన్నారు. అన్ని రంగాల్లో అందరూ రాణించవచ్చని, అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రత్యేకంగా రంగాలు లేవని, తమకు ఇష్టం ఉంటే ఏ రంగంలోనైనా స్థిరపడవచ్చని హర్షిణి పేర్కొన్నారు.