: జీఎస్టీ దెబ్బకు ప్రజల్లో తగ్గిపోయిన కొనుగోలు శక్తి... నాలుగేళ్ల కనిష్ఠానికి పీఎంఐ
గడచిన నెల రోజులుగా దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను అమలు అవుతుండగా, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూలై నెల సర్వీసెస్ పీఎంఐ (పర్చేజ్ మేనేజింగ్ ఇండెక్స్) 50 పాయింట్ల మార్క్ కన్నా కిందకు జారింది. తాజా సర్వేలో సెప్టెంబర్ 2013 తరువాత అత్యంత కనిష్ఠ స్థాయిలో 45.9 పాయింట్లకు చేరింది. గడచిన జూన్ నెలలో ఎనిమిది నెలల గరిష్ఠస్థాయిలో 52.7గా ఉన్న పీఎంఐ, సమీప భవిష్యత్తులో మార్చి 2009 స్థాయికి పడిపోయి 46 వరకూ చేరవచ్చని నిక్కీ/ఐహెచ్ఎస్ మార్కిట్ కాంపోజిట్ పీఎంఐ అంచనా వేసింది.
నోట్ల రద్దు తరువాత పీఎంఐ ఇండెక్స్ తగ్గుతూ వచ్చినప్పటికీ, జీఎస్టీ అమలుకు ముందు పలు రకాల ప్రొడక్టుల్లో వచ్చిన ఆఫర్ల కారణంగా అమ్మకాలు సంతృప్తికరంగా సాగిన మీదటే జూన్ పీఎంఐ సంతృప్తిగా కనిపించిందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేశారు. జీఎస్టీ అమలు తరువాత నిర్మాణ రంగం ఎంతో అయోమయంలో పడిపోయిందని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ పల్లీయానా డీ లిమా వెల్లడించారు. ఎన్నో వస్తువులపై పన్నులు పెరిగాయని ఆయన అన్నారు. ఉత్పత్తిరంగంతో పాటు పలు కీలక రంగాల్లో జీఎస్టీ అమలుపై కన్ఫ్యూజన్ నెలకొని ఉందని వెల్లడించారు.