: ఎలక్షన్ కమిషనర్ల ఎంపికకు కొలీజియం పధ్ధతి వుండదు... స్పష్టం చేసిన ప్రభుత్వం
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా లా కమిషన్ సూచించినట్లు కొలీజియం పద్ధతి ద్వారా ఎలక్షన్ కమిషనర్లను నియమించే ఆలోచన తమకు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు కూడా చేయలేదని కేంద్ర న్యాయ సహాయ మంత్రి పీపీ చౌదరి లోక్‌సభకు రాతపూర్వక సమాధానమిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి సలహా మేరకు ఏర్పాటు చేసిన కొలీజియం ద్వారా నియమించాలని సూచిస్తూ మార్చి 2015లో లా కమిషన్ నివేదిక సమర్పించింది.
ఈ కొలీజియంలో ప్రధానితో పాటు, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని సూచించింది. ఈ సిఫారసుకు అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నజీం జైదీ సుముఖత వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నపుడు బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ కూడా ఎన్నికల కమిషనర్లను, కాగ్‌ను కొలీజియం పద్ధతిలో నియమించాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరిన సంగతి తెలిసిందే.