: నితీశ్ మంత్రివర్గంలో బాగా పనిచేసింది నా కుమారుడు మాత్రమే!: లాలూ ప్రసాద్ యాదవ్
ఆర్జేడీ కూటమి నుంచి విడిపోయి బీజేపీ మద్దతుతో మళ్లీ బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా నిప్పులు చెరగడం ఆపలేదు. మీడియాలో, ట్విట్టర్‌లో నితీశ్ ప్రభుత్వం చేసిన తప్పులు, లోపాల గురించి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ నితీశ్ మంత్రివర్గంలో తన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ మినహా మిగతా మంత్రులెవ్వరూ తమ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని పేర్కొన్నారు. తన మరో కుమారుడు, బిహార్ ఆరోగ్య మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించలేదని అన్నారు. అంతేకాకుండా గత 20 నెలల్లో నితీశ్ ప్రభుత్వం చేసిన గొప్ప పని ఒక్కటి కూడా లేదని ఆయన దుయ్యబట్టారు.
తేజస్వి యాదవ్‌ని పొగడి, తేజ్ ప్రతాప్‌ను లాలూ ఆరోపించడం వెనక ఉన్న కారణాలు అందరికీ తెలిసినవే. ఆరోగ్య మంత్రిగా తేజ్ ప్రతాప్ పనితనం అంతంత మాత్రమే. అత్యున్నత ప్రమాణాలు గల అంబులెన్స్‌ను తన ఇంటి ముందు ఉంచుకోవడం, ప్రజల క్షేమం కన్నా సినిమాలో నటించడానికే ఎక్కువ సమయం కేటాయించడం వంటి అనేక పనుల వల్ల తేజ్ ప్రతాప్ చెడ్డపేరు తెచ్చుకున్నారు. మరో పక్క ఉపముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ బాధ్యతల నిర్వహణలో ఎలాంటి మచ్చ లేకున్నా, కొద్ది రోజుల క్రితం జరిగిన సీబీఐ దాడుల్లో ఆయన అవినీతికి పాల్పడ్డట్లు తేలింది. ఈ కారణంతోనే నితీశ్, ఆర్జేడీతో తన పొత్తును వదులుకున్నాడు.