: తను నిండుచూలాలు... జన్మనిచ్చేందుకు సమయం ముంచుకొస్తున్నా వృత్తి ధర్మాన్ని మరువలేదు!
నిండుచూలాలు...బిడ్డకు జన్మనిచ్చేందుకు సమయం ముంచుకొస్తోంది. అయినా ప్రమాదంలో పడిన పసికందును ఆపరేషన్ ద్వారా తీసి వృత్తికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని కెంటకీ స్టేట్ లో డాక్టర్ అమంద హెస్ ను జూలై 23న ప్రసవం కోసం సిద్ధం చేశారు. అదే సమయంలో లేహ్ హాలీడే జాన్సన్ అనే మరో మహిళ ప్రమాదకర పరిస్థితిలో ఆసుపత్రిలో చేరింది. ఆమెను స్కాన్ చేసి చూడగా, గర్భంలోని బిడ్డ తలకు పేగు చుట్టుకుని అడ్డం తిరిగాడు. దీంతో డెలివరీ సాధ్యం కావడంలేదు.
ఆ సమయంలో సాధారణ డెలివరీ చేస్తే బిడ్డతో పాటు తల్లికి కూడా ప్రాణాపాయం. డాక్టర్ వచ్చేందుకు సమయం పడుతుందని సిబ్బంది హైరానా పడుతున్నారు. దీంతో తన ప్రసవం సంగతి కాసేపు పక్కనపెట్టిన ఆమె నేరుగా ఏప్రాన్ ధరించి ఆపరేషన్ ధియేటర్ లోకి ప్రవేశించారు. బాధితురాలికి, బిడ్డకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఆపరేషన్ చేశారు. వెంటనే డెలివరీ కోసం ఆమె వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆసుపత్రితో పాటు, బాధితురాలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. దీంతో డాక్టర్ అమంద హెస్ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయారు. 'డాక్టర్ మామ్.. మీరు సూపర్' అంటూ పలువురు సందేశాలు పంపుతున్నారు.