: డీఆర్డీవో సృష్టి... విమానం సముద్రంలో కూలిపోయినా నీట్లో తేలియాడే బ్లాక్ బాక్స్!
విమానం సముద్రంలో కూలిపోయినా విమానం నుంచి తనంతతానుగా విడివడి (ఎజెక్ట్ అయి) నీటి ఉపరితలానికి వచ్చి తేలుతూ, తానున్న చోటు తెలిసేలా సంకేతాలను వెలువరించే శాటిలైట్ ట్రాన్స్ మీటర్ తో కూడిన సరికొత్త బ్లాక్ బాక్స్ ను డిఫెన్స్ రీసెర్చ్ డెవెలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తయారుచేసింది. 1.03 కేజీల బరువుతో 155 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ బ్లాక్ బాక్స్ కు బి-శాట్ అని పేరు పెట్టారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన దీనిని డీఆర్‌డీవోలోని ‘నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబొరేటరీ’ అభివృద్ధి చేసి, ప్రయోగాత్మకంగా పరీక్షించింది. నీరు తగలగానే విమానం నుంచి విడివడుతుందని, వెంటనే యాక్టివేట్ అయి పని ప్రారంభిస్తుందని చెప్పారు. ఇది నిర్విరామంగా 48 గంటలపాటు నీటిపై తేలియాడుతూ సంకేతాలు పంపుతుందని, ఇది పంపే సంకేతాలను సెర్చ్ ప్లేన్లు గుర్తించగలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
వాస్తవానికి దీనిని సముద్రగర్భంలో నిర్ణీత లోతుకు మించి కిందికి వెళ్లి మునిగిపోయే జలాంతర్గాములను కనిపెట్టడం కోసం తయారు చేశారు. అయితే జలాంతర్గాముల కంటే పౌర విమానయాన రంగానికే ఎక్కువ ఉపయోగం అని నేవీ అధికారులు చెబుతున్నారు. టార్పెడోలను గుర్తించేందుకు వినియోగించే ట్రాకింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించి దీనిని రూపొందించామని దీని రూపకర్తలు చెబుతున్నారు. దీనిని విమానాల్లో వినియోగించుకునేలా మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయాలని డీఆర్‌డీవో నిర్ణయించింది. అమెరికా, రష్యాల్లో దీనికి పేటెంట్ పొందనున్నామని, అనుమతులన్నీ లభించిన తరువాత విదేశాలకు కూడా ఎగుమతి చేయనున్నామని అన్నారు. సాధారణంగా విమానం సముద్రంలో కూలినప్పుడు శకలాలు అక్కడే ఉండవు. అలలు ఆ శకలాలను నెట్టివేస్తాయి. బ్లాక్ బాక్స్ కూడా వాటితోపాటు కొట్టుకుపోతుంది. బి-శాట్‌తో ఆ సమస్య పరిష్కారం కానుందని వారు చెప్పారు.