: త్వరలో బ్యాంక్ అకౌంట్ నంబర్ పోర్టబిలిటీ!
మొబైల్ నంబర్ పోర్టబిలిటీలాగే బ్యాంకు అకౌంట్ నెంబర్‌ను నచ్చిన బ్యాంకుకు మార్చుకునే పోర్టబిలిటీ సౌకర్యాన్ని త్వరలో బ్యాంకులు కల్పించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై దృష్టి సారించాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా అన్ని బ్యాంకులను ఆదేశించారు. ఒకవేళ ఇది సాకారమైతే బ్యాంకు సౌకర్యాలతో సంతృప్తి చెందని వారు అదే అకౌంట్ నంబర్‌తో వేరే బ్యాంకులో లావాదేవీలు కొనసాగించే సౌలభ్యం కలుగుతుంది.
ఆర్థిక రంగంలో పోటీతత్వం పెంచి, వినియోగదారులకు మేలైన సేవలు అందించే ఉద్దేశంతోనే ఈ పోర్టబిలిటీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల వినియోగదారులకు మంచి సేవలందించే బ్యాంకుల్లో అకౌంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాల కోసం ప్రతి ఏడాది నిర్వహించే బ్యాంక్ అంబుడ్స్‌మన్ వార్షిక సదస్సులో బ్యాంకు పోర్టబిలిటీ అంశం గురించి చర్చించారు.