: ఆడ, మగ కాని హిజ్రాలు చీరలెలా కడతారు?.. కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే వివాదాస్పద వ్యాఖ్యలు


వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేంద్ర సామాజిక న్యాయ, సాధికారశాఖా మంత్రి రామ్‌దాస్ అథవాలే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రాన్స్‌జెండర్లు చీరలు కట్టుకోరాదన్నారు. వారు ఆడా కాదు, మగా కాదని, వారు మనుషులని పేర్కొన్నారు. మహిళలు కాని వారు చీరలు కట్టుకోరాదని సూచించారు. మరి వారు ఎటువంటి దుస్తులు ధరించాలన్న మీడియా ప్రశ్నకు.. పురుషుల్లా ప్యాంటు, షర్టు ధరించాలని సూచించారు.

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన డెవలపింగ్ మాడ్యూల్స్ ఫర్ సెన్సిటైజింగ్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అండ్ స్టేక్ హోల్డర్స్’ వర్క్‌షాపులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. హిజ్రాలు చీరలు ధరించరాదన్నది తన అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేశారు. దేశంలో ఆరు లక్షలమందికిపైగా హిజ్రాలు ఉన్నారన్నారు. స్త్రీ, పురుషులతో సమానంగా వారికి సమాజంలో గౌరవం లభించేలా చట్టం తీసుకువస్తున్నట్టు తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే దానిని ప్రవేశపెడతామన్నారు. అలాగే వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలలను కూడా ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. స్కూలుకు, ఇతర పనులకు వెళ్తున్నప్పుడు వారిని ఛీదరించుకుంటున్నారని, అందుకే వారు చదువుకు దూరంగా ఉండిపోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News