: నెలకు 12 లక్షల వేతనంతో ఉద్యోగం సంపాదించిన ఇంటర్ విద్యార్థి!


కలలు నిజం చేసుకోవడంలో కొందరు అత్యుత్తమ ప్రతిభ చూపిస్తుంటారు. అలాంటి మట్టిలో మాణిక్యం ఇంటర్ లోనే నెలకు 12 లక్షల వేతనంతో గూగుల్ లో ఉద్యోగం సంపాదించడం ఆసక్తి రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... చండీగఢ్ లోని ప్రభుత్వ మోడల్ స్కూల్ లో సీనియర్ సెకెండరీ స్కూల్ లో ఐటీ విద్యనభ్యసిస్తున్న హర్షిత్‌ శర్మ కు గూగుల్ సంస్థలో ఉద్యోగం సంపాదించడం కల. పదేళ్ల వయసు నుంచే బంధువు రోహిత్ శర్మ ప్రేరణతో గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకున్న హర్షిత్ శర్మ డిజిటల్ ఇండియాలో భాగంగా పలు కార్యక్రమాలకు పోస్టర్లు డిజైన్ చేశాడు. పలు బాలీవుడ్ తారల పోస్టర్లు కూడా ఆకట్టుకునేలా రూపొందించేవాడు.

 అలా డిజైనింగ్ చేస్తూ ప్రతి నెలా 40 నుంచి 50 వేల రూపాయల వరకు సంపాదించేవాడు. దీని స్పూర్తిగా గూగుల్ కు తను రూపొందించిన పలు పోస్టర్లు పంపాడు. వాటిని పరిశీలించిన గూగుల్ సంస్థ తమ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగానికి ఆహ్వానించింది. ఏడాది శిక్షణ కోసం కాలిఫోర్నియా గూగుల్ కార్యాలయానికి రావాలని సూచించింది. శిక్షణ సమయంలో నెలకు 4 లక్షల రూపాయల వేతనం ఇస్తామని తెలిపింది. శిక్షణ ముగిసిన అనంతరం నెలకు 12,00,000 రూపాయల వేతనం ఇస్తామని పోస్టింగ్ ఆర్డర్ లో తెలిపింది. కలల సంస్థలో మంచి వేతనంతో ఉద్యోగం రావడంతో హర్షిత్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఆగస్టు 7న కాలిఫోర్నియా వెళ్తున్నట్టు తెలిపాడు. 

  • Loading...

More Telugu News