: నాలుగు రోజులు ఎండలే... వర్షాలకు చాన్స్ లేదంటున్న వాతావరణ శాఖ!
విదర్భ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ భూ ఉపరితల ద్రోణి ఉన్నప్పటికీ, అది అల్పపీడనంగా మారే అవకాశాలు లేకపోవడంతో ఆగస్టు 3, 4 తేదీల వరకూ వర్షాలు కురిసే అవకాశాలు లేవని, ఈ నాలుగు రోజులూ ఉష్ణోగ్రతలు సాధారణంతో పోలిస్తే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలోని పడమర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తన సముద్రంపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణ ఒడిశా, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న రుతుపవనాలు మరింత బలహీన పడతాయని, తదుపరి వారం రోజుల వ్యవధిలో వాతావరణ మార్పులు పెద్దగా చోటు చేసుకోక పోవచ్చని అంచనా వేశారు. కాగా, నిన్న సాయంత్రం హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.