: ఇరాన్ ఉపగ్రహ ప్రయోగంపై అమెరికా కన్నెర్ర.. ఆంక్షలు విధించిన అగ్రరాజ్యం
ఇరాన్ ఉపగ్రహ ప్రయోగంపై అమెరికా కన్నెర్ర చేసింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆరు కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టగలిగే రాకెట్‌ను ఇరాన్ విజయవంతంగా పరీక్షించిందని ఇరాన్ అధికారిక టెలివిజన్ గురువారం ప్రకటించింది. అయితే ఈ ప్రయోగ ముఖ్య ఉద్దేశం ఉపగ్రహాల ప్రయోగం కాదని, బాలిస్టిక్ మిసైల్స్ అభివృద్ధేనని భావిస్తున్న అమెరికా ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇరాన్ చర్య ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాలను ఉల్లంఘించడమే అవుతుందని ఈ సందర్భంగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ తదితర దేశాలు ఆరోపించాయి. ఐరాస తీర్మానాల ప్రకారం ఇరాన్ ఇటువంటి పరీక్షలు నిర్వహించరాదని పేర్కొన్నాయి. ఇరాన్‌పై ఆంక్షలు విధించడంపై ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ ఐరాస తీర్మానాలకు అనుగుణంగా వ్యవహరించే వరకు ఇరాన్‌పై ట్రంప్ ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.