: తప్పుల నుంచి నేర్చుకోవడం నాకిష్టం: శిల్పా శెట్టి
`స్టైల్ అనేది వ్యక్తిగత విషయం. అనుభవం కొనుగోలు చేయలేనిది. నా కెరీర్‌లో చాలా తప్పులు చేశా. వాటి నుంచి చాలా నేర్చుకున్నాను. అలా నేర్చుకోవడం నాకిష్టం` అంటూ బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చెప్పుకొచ్చింది. ముంబైలో జరిగిన ఐసీడబ్ల్యూ వేడుకలో డిజైనర్ మోనీషా జైసింగ్ రూపొందించిన దుస్తుల్లో ఈ సుందరి తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ దుస్తులు ధరించడంలో తనదైన ముద్ర వేసిన శిల్పా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది. ఏదైనా సరే తను కొత్తగా ప్రయత్నిస్తానని, అందులో భాగంగా తలెత్తే తప్పుల వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటానని శిల్పా తెలియజేసింది. తన అభిరుచికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త దుస్తులు రూపొందించి ఇవ్వడంలో తన డిజైనర్ మోనీషా అన్ని రకాలుగా సహకరిస్తారని శిల్పా చెప్పింది.