: షీనాబోరాను ఇంద్రాణి ఎలా చంపిందీ కోర్టుకి వివరించిన కారు డ్రైవర్!
ముంబైలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్‌వర్ రాయ్ కోర్టుకి వాంగ్మూలం ఇచ్చాడు. షీనాబోరాను ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి హత్య చేసిందని శ్యామ్‌వర్ రాయ్ న్యాయస్థానానికి తెలిపాడు. షీనా మృతదేహానికి ఇంద్రాణి లిప్ స్టిక్ రాసి, జుట్టు సరిచేసి, పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు రాయ్ ముంబై కోర్టుకు వివరించాడు. ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, షీనాబోరా కలిసి కారులో బాంద్రా నుంచి బయలుదేరినట్లు, ఆ తర్వాత ఇంద్రాణి చెప్పిన ప్రకారం తాను, సంజయ్‌లు షీనాను గట్టిగా పట్టుకోగా ఆమె గొంతు నులిమి చంపేసిందని రాయ్ చెప్పాడు.
తర్వాత పాలి హిల్ వద్ద మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు తెలిపాడు. తగల బెట్టడానికి ముందు షీనా మృతదేహానికి లిప్ స్టిక్ రాసి, జుట్టు సరిచేశారని వివరించాడు. ఈ విషయాలు ఎక్కడా చెప్పొద్దని, చెబితే ప్రమాదమని ఇంద్రాణి తనని హెచ్చరించినట్లు రాయ్ వెల్లడించాడు. 2012లో జరిగిన షీనాబోరా హత్య కేసు 2015లో ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం ఈ హత్యకేసులోనే ఇంద్రాణి, సంజీవ్ ఖన్నాలు రిమాండ్ ఖైదీలుగా వున్నారు.