: చిన్నమ్మ మెడకు మరో ఉచ్చు... శశికళ జైలు జీవితంపై విచారణ కోరుతూ న్యాయవాది ఫిర్యాదు
అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే (అమ్మ) చీఫ్ శశికళ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. శశికళ జైలు జీవితంపై విచారణ కోరుతూ బెంగళూరుకు చెందిన న్యాయవాది నటరాజశర్మ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. జైలు సిబ్బందికి కోట్లాది రూపాయలు లంచం ఇచ్చిన శశికళ జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నారని పేర్కొని సంచలనం సృష్టించిన జైళ్ల శాఖ మాజీ డీఐజీ రూప ఆరోపణలకు తాజాగా న్యాయవాది చేసిన ఫిర్యాదు బలం చేకూరుస్తోంది.
డీజీపీ సత్యనారాయణరావు సహా పలువురు రూ.2 కోట్ల ముడుపులు అందుకుని శశికళకు జైలులో సకల సదుపాయాలు కల్పించారని రూప కర్ణాటక ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అయితే రూప తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని సత్యనారాయణ రావు కొట్టి పడేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రూప రెండు రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే రూ.50 కోట్లకు పరువునష్టం కేసు వేస్తానంటూ రూపకు నోటీసులు కూడా పంపారు. అయితే తాను క్షమాపణలు చెప్పేది లేదని రూప తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉండగా తాజాగా న్యాయవాది నటరాజశర్మ చేసిన ఫిర్యాదు రూప ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఈ ముడుపుల కేసుతో సంబంధం ఉన్న దినకరన్‌తోపాటు ఆస్ట్రేలియాకు చెందిన ప్రకాశ్ అనే వ్యక్తిని కూడా విచారించాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ కోరిక మేరకే ప్రకాశ్ సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని నటరాజశర్మ పేర్కొన్నారు.