: తెలంగాణలో మరో సంచలనం.. భారీ డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు.. కేంద్ర ఇంటెలిజెన్స్ అదుపులో నిందితులు!
డ్రగ్స్.. డ్రగ్స్.. డ్రగ్స్.. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఓ వైపు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారిస్తుంటే, మరోవైపు కేంద్ర ఇంటెలిజిన్స్ సంస్థ శుక్రవారం చడీచప్పుడు కాకుండా మరో భారీ డ్రగ్ రాకెట్ ముఠా గుట్టును రట్టు చేసి సంచలనం సృష్టించింది.
మెదక్, నల్గొండ, జిల్లాల్లోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిపిన డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఏకంగా 600 కేజీల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ ఇంత పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. కాగా, పట్టుబడిన మత్తు పదార్థాలను ల్యాబ్‌లలో తయారుచేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఈ ల్యాబ్‌లు ఏవైనా సంస్థలకు చెందినవా? లేక డ్రగ్స్ తయారీ కోసం ఈ ముఠానే వాటిని ఏర్పాటు చేసిందా? అన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.