: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనర్హత వేటుపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్
పనామా అవినీతి కేసులో పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు నిర్ణయాన్ని తీసుకున్నందుకు న్యాయవ్యవస్థకు ఆయన సెల్యూట్ చేశారు. చివరికి ఒక శక్తిమంతమైన వ్యక్తిని పట్టుకున్నారని, ఈ విషయంలో న్యాయమూర్తులే అసలైన హీరోలని ఇమ్రాన్ కీర్తించారు. నవాజ్ షరీఫ్ కారణంగా పాకిస్థాన్ పురోగతి ఆగిపోయిందని, ఇక ఇతర దేశాల్లాగ పాక్ కూడా ముందుకెళ్లే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. షరీఫ్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ముగ్గురిలో ఇమ్రాన్ కూడా ఉన్నారు. షరీఫ్ కేసులో పాకిస్థాన్ కోర్టు పాశ్చాత్య దేశాల శైలిని అనుసరించదని, ఈ కేసు గెలవడంలో తనకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ఇమ్రాన్ ప్రకటించారు.