: జీఎస్టీ ప్రచారానికి టీవీ ఛానళ్ల సహాయం కోరిన ప్రభుత్వం
జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వస్తు సేవల పన్ను గురించి ప్రచారం చేయడంలో సహాయం చేయాలని ప్రైవేట్ టీవీ ఛానళ్లను ప్రభుత్వం కోరింది. జీఎస్టీ ప్రచార కార్యక్రమం `మంథన్`ను విజయవంతం చేయడానికి అందుకు సంబంధించిన వివరాలను టీవీలో స్క్రోలింగ్ ఇవ్వాలని అన్ని వార్తావినోద ఛానళ్లను సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కోరింది. దీంతో పాటు `మిషన్ ఇంద్రధనుష్` కార్యక్రమానికి కూడా వీలైనంత ప్రచారం కల్పించాలని టీవీ ఛానళ్లను, ఎఫ్ఎం రేడియోలను ప్రభుత్వం కోరింది. పెద్ద కంపెనీలు జీఎస్టీ విధానాలను అర్థం చేసుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వర్తకులు, దుకాణదారులకు ఇంకా జీఎస్టీకి సంబంధించిన పరిజ్ఞానం రాలేదని సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడుతోంది. ఈ నేపథ్యంలోనే జీఎస్టీ గురించి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.