: సోషల్ మీడియాలో మీ ఇల్లు, కార్లు, విలువైన వస్తువులు లాంటివి పోస్ట్ చేస్తే... బుక్కైనట్టే!
ప్రస్తుత కాలంలో చాలా మంది జీవితాలు సోషల్ మీడియాతో పెనవేసుకుని పోయాయి. ఎంతగానంటే, వారి జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్ని సోషల్ మీడియాలో ముక్కూమొహం తెలియని వారితో కూడా పంచుకునేంతగా! ఇప్పుడు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా మలచుకునేందుకు అడుగులు వేస్తోంది. పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు సోషల్ మీడియాపై డేగ కన్ను వేయబోతోంది. బ్యాంకులు, ఖాతాలు తదితర సంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే ఇప్పటి వరకు పన్ను ఎగవేత సమాచారాన్ని సేకరిస్తున్న ఐటీ శాఖ... ఇకపై జనాల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి సారించనుంది.
ఇళ్లు, కార్లు, విలువైన వస్తువులు, ఫంక్షన్లు తదితర వివరాలను, ఫొటోలను జనాలు సోషల్ మీడియాలో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వానికి ఓ ఆయుధంగా మారనుంది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని జనాల తప్పుడు లెక్కలు, భారీ ఎత్తున జరుగుతున్న పన్ను ఎగవేతపై ఉక్కుపాదం మోపనుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాలను ఐటీ శాఖ పరిశీలించనుంది. వీటిలో ఉన్న వివరాల ఆధారంగా... ఆదాయపు పన్ను ఖర్చు నమూనాలతో అవి సరిపోయాయా? లేదా? అనే విషయాన్ని బేరీజు వేసుకోబోతోంది. ఈ నెల నుంచే ఈ ప్రక్రియ మొదలు కానున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో, పన్ను చెల్లించనివి సోషల్ మీడియాలో కనిపిస్తే, ఐటీ నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. దీని ద్వారా ప్రభుత్వానికి 40 శాతం పన్ను వసూలు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 'ప్రాజెక్ట్ ఇన్ సైడ్' పేరుతో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 156 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే... పన్ను ఎగవేతరాయుళ్లకు కష్టకాలం మొదలైనట్టే.