: నా కొడుకు నిప్పు...ఎలాంటి పరీక్షైనా సిధ్దం: రవితేజ తల్లి ప్రకటన
తన కుమారుడు నిప్పులాంటి వాడని టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. డ్రగ్స్ ఆరోపణలపై రేపు సిట్ ముందుకు రవితేజ హాజరుకానున్న నేపథ్యంలో ఆమెను సంప్రదించిన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని తెలిపారు. ఏవైనా కుట్రలు జరిగితే తప్ప, తన కుమారుడు తప్పు చేశాడని ఎవరూ నిరూపించలేరని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. రేపటి విచారణ సమయానికి సిట్ కార్యాలయానికి తన కుమారుడు వస్తాడని ఆమె చెప్పారు. విచారణలో ఎదురయ్యే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతాడని, సిట్ అధికారులు కోరితే పరీక్షల కోసం రక్తనమూనా ఇచ్చేందుకు కూడా సిద్ధమని ఆమె అన్నారు. ఏవైనా అలవాట్లు ఉంటే తాము భయపడాలి కానీ, ఏ అలవాట్లు లేని తన కుమారుడి పట్ల తమకు భయం ఎందుకని ఆమె ప్రశ్నించారు. దీంతో రేపటి విచారణ పట్ల రవితేజ స్పష్టంగా ఉన్నట్టు అర్ధమవుతోంది.