: బిగ్‌బాస్ హౌస్‌కి గుత్తా జ్వాలా?
ఎన్టీఆర్ వ్యాఖ్యానం పుణ్యమాని బిగ్‌బాస్ షోకి వారాంతాల్లో రేటింగ్స్ పెరిగిపోతున్నా, మిగతా రోజుల్లో పార్టిసిపెంట్ల ఓవర్ యాక్షన్ చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని బిగ్‌బాస్ నిర్వాహకులు కనిపెట్టినట్లున్నారు. అందుకే త్వరలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త పార్టిసిపెంట్లను బిగ్‌బాస్ ఇంట్లోకి పంపేందుకు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాను కలిసినట్లు సమాచారం. ఇదివరకు కూడా షోలో కొత్తదనం కోసం యాంకర్ అనసూయను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. వాటిలో నిజం లేదని స్వయంగా అనసూయే వెల్లడించారు. ఏదేమైనా అంతో ఇంతో క్రేజ్ ఉన్న సంపూ అర్థంతరంగా వెళ్లిపోవడంతో బిగ్‌బాస్ షోకు ఈ వారం నుంచి రేటింగ్స్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పార్టిసిపెంట్లలో ఇప్పటికే మధుప్రియ, ముమైత్, కల్పనలు ఇంటి మీద బెంగతో ఏడ్వడం చూస్తూనే ఉన్నాం. వీళ్లని వీలైనంత త్వరగా ఇళ్లకు పంపి కొత్త వాళ్లను దింపే ప్రయత్నంలో బిగ్‌బాస్ నిర్వాహకులు ఉన్నట్లు తెలుస్తోంది.