: చిరంజీవి షో ద్వారా వచ్చిన డబ్బును రోజా ఏం చేశారంటే?
మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేసిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా చిరంజీవి అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. రూ. 6 లక్షలను గెలుచుకున్నారు. ఆ సందర్భంగా, ఈ డబ్బును ఏం చేస్తారంటూ రోజాను చిరంజీవి ప్రశ్నించారు. దానికి సమాధానంగా ప్రజలకు బస్ షెల్టర్ కట్టిస్తానని చెప్పారు.
అప్పుడు చిరంజీవికి చెప్పిన మాటను ఇప్పుడు రోజా నిలుపుకున్నారు. తన నియోజకవర్గం నగరిలో వంద పడకల ఆసుపత్రి ఉంది. అయితే, అక్కడ సరైన బస్ షెల్టర్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, అక్కడ బస్ షెల్టర్ నిర్మాణానికి నిన్న రోజా భూమి పూజ చేశారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోలో తాను గెలుచుకున్న రూ. 6 లక్షల్లో పన్నులు పోగా రూ. 4.50 లక్షల వరకు ఆమెకు వచ్చింది. ఈ మొత్తాన్ని ఆమె బస్ షెల్టర్ నిర్మాణానికి వినియోగించారు.