: మైక్ కమ్మింగా కెరీర్ గ్రాఫ్... ఆసక్తి కలిగించే విషయాలు!
డ్రగ్స్ కేసులో అరెస్టైన నెదర్లాండ్స్ దేశస్తుడు మైక్ కమ్మింగా కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆశ్చర్యం కలగక తప్పదు. అంత మంచి నైపుణ్యాలు ఉండి, డ్రగ్స్ ఊబిలో ఎలా చిక్కుకున్నాడో మరి! ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ మైక్ కమింగాను కీలక నిందితుడిగా సంబోధించారు. అంటే, అటు వృత్తిపరమైన పరిచయాలను చీకటి వ్యాపారానికి కూడా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ సోషల్ మార్కెటింగ్‌లో 12 ఏళ్ల అనుభవం ఉన్న కమ్మింగా దగ్గర దాదాపు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న `84 ఐడియాస్` కంపెనీకి కమ్మింగా సీఓఈగా పనిచేశాడు. ఈ సంస్థ ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇన్నోమైండ్స్ కంపెనీలో సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా టెక్నాలజీ సేల్స్, డిజిటల్ స్ట్రాటజీ, వెబ్ డెవలప్‌మెంట్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆఫ్‌షోర్ బిజినెస్ ఆపరేషన్స్‌లోనూ అనుభవం ఉన్నట్లు కమ్మింగా తన బయోడేటాలో పేర్కొన్నాడు. అమెరికా, దుబాయ్, యూరప్ వంటి దేశాల్లో కమ్మింగా పనిచేశాడు. నెదర్లాండ్‌లోని రోటర్‌డ్యాం ప్రాంతానికి చెందిన కమ్మింగాను విచారిస్తే మరిన్ని పేర్లు బయటకి వచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.