: నాకు దేవుడిపై నమ్మకం లేదు.. ఆసక్తితోనే బౌద్ధమతం స్వీకరించా: కమల్ తనయ అక్షరహాసన్
తన అక్కయ్య శ్రుతిహాసన్ లానే తనకూ కూడా దేవుడిపై నమ్మకం లేదని, అయితే ఆసక్తితోనే బౌద్ధమతం స్వీకరించానని విలక్షణ నటుడు కమలహాసన్ రెండో కూతురు అక్షరహాసన్ చెప్పింది. వివేగం చిత్రంలో అజిత్ సరసన నటిస్తున్న అక్షర, హీరోయిన్ గా కోలీవుడ్ కు పరిచయం కానుంది. ఈ నేపథ్యంలో చెన్నైలో విలేకరులతో అక్షర మాట్లాడుతూ, తాను ఇటీవలే బౌద్ధమతం స్వీకరించానని చెప్పింది. సినిమాల గురించి ప్రస్తావిస్తూ, తనకు చిన్ననాటి నుంచే దర్శకత్వంపై ఆసక్తి ఉందని, ముంబైలో కొన్ని చిత్రాలకు సహాయ దర్శకురాలిగా పని చేశానని చెప్పింది.
అయితే, నటనపై ఆసక్తి కారణంగా దానిపై ప్రస్తుతం దృష్టి సారించానని చెప్పింది. తన కుటుంబానికి చెందిన వాళ్లు, బంధువులు అందరూ ఈ రంగంలోనే ఉన్నారని, వాళ్లందరితో కలిసి ఓ సినిమా చేయాలనేది తన కోరిక అని చెప్పిన అక్షర, డైరెక్టర్ గా తాను విజయం సాధించిన తర్వాతే తన అమ్మానాన్న, అక్కతో ఓ సినిమా నిర్మిస్తానని చెప్పింది. ఇక, తన తండ్రి కమల్ రాజకీయాల్లోకి వచ్చే విషయమై ప్రశ్నించగా, ఆయన ఇష్టమని, దాని గురించి తాను మాట్లాడనని చెప్పింది.