: కాబూల్ లో దారుణం.. ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల మెరుపుదాడి!
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో దారుణం చోటుచేసుకుంది. ఆర్మీ క్యాంపుపై తాలిబన్ ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. కాందహార్ ప్రాంతంలోని ఖక్రీజ్ జిల్లా కేంద్రం శివారులో గల బేస్ క్యాంపుపై నిన్న రాత్రి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. తుపాకులతో దాడిచేస్తూ, సైనికుల వద్ద ఉన్న ఆయుధాలను అపహరించే ప్రయత్నం చేశారు. అయితే, జవాన్లు వీరోచితంగా ప్రతిఘటించారు. ఈ రోజు ఉదయం వరకు ఉగ్రవాదులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఉగ్రవాదుల దాడిలో 26 మంది జవాన్లు మృతి చెందారు. ఆర్మీ జవాన్లు తిరిగి కాల్పులు జరిపిన సంఘటనలో 82 మంది తాలిబన్లు హతమైనట్లు ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. ఖజ్రీజ్ ప్రాంతమంతా సైన్యం అధీనంలోనే ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.