: దుమారం రేపిన కోవింద్ ప్రసంగం.. కాంగ్రెస్ ఎంపీల నిరసన!
భారత నూతన రాష్ట్రపతి కోవింద్ నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాన మంత్రి నెహ్రూ పేరును కోవింద్ ప్రస్తావించకపోవడం పట్ల కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఎంపీలు ఈరోజు పార్లమెంటులో నిరసనకు దిగారు. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం అయిన వెంటనే కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ లేచి, కోవింద్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ నిర్మాణంలో ఏమాత్రం పాత్ర లేని దీన్ దయాళ్ శర్మను మహాత్మాగాంధీతో పోల్చారని, ఇది చాలా దారుణమని మండిపడ్డారు. ఎంతో మంది పేర్లు కోవింద్ కు గుర్తుకు వచ్చాయని... తొలి ప్రధాని నెహ్రూ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీల పేర్లు మాత్రం ఆయనకు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
జాతి నిర్మాతలను గౌరవించడం మన దేశ సంస్కృతి అని... దేశ స్వాతంత్ర్యం కోసం జైలుకు కూడా వెళ్లిన నెహ్రూ పేరును ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని ఆనంద్ శర్మ అన్నారు. ఆయన బీజేపీకి మాత్రమే రాష్ట్రపతి కాదని... దేశం మొత్తానికి రాష్ట్రపతి అనే విషయాన్ని కోవింద్ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, రాష్ట్రపతి ప్రసంగాన్ని రాజకీయం చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో, కాసేపు సభను వాయిదా వేశారు.