: ఇంటి నుంచి బయటకు ముద్రగడ... ఒక్క అడుగు కూడా వేయనివ్వని పోలీసులు
చలో అమరావతి పేరిట తాను తలపెట్టిన పాదయాత్రను ఎలాగైనా చేసి తీరుతానని పట్టుబట్టిన కాపు వర్గం నేత ముద్రగడ పద్మనాభం, చెప్పినట్టుగానే, కొద్ది సేపటి క్రితం ఇంటి బయటకు రావడంతో, గేటు కూడా దాటకముందే పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తనను పాదయాత్రకు వెళ్లనివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. పోలీసులు మాత్రం, ర్యాలీకి, పాదయాత్రలకు ఈ ప్రాంతంలో అనుమతులు లేనందున, బయటకు అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేస్తున్న పరిస్థితి.
ఇక ముద్రగడకు మద్దతుగా వందలాది మంది కిర్లంపూడి వాసులు తరలిరావడంతో, పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. ముద్రగడ మాట వినకుంటే, అరెస్ట్ చేసి కాకినాడకు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత వారం రోజులుగా కిర్లంపూడిని చుట్టుముట్టిన పోలీసులు, నేడు భద్రతను మరింతగా పెంచారు. కిర్లంపూడి, అమలాపురం ప్రాంతాల్లో గట్టి బందోబస్తును నిర్వహిస్తూ, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు. జిల్లాతో వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోంది.