: అభిమానులను నిరాశపరిచిన సంపూర్ణేష్ బాబు... బిగ్ బాస్ షో నుంచి అవుట్?
తెలుగు బుల్లి తెరపై సెన్సేషన్ గా మారిన బిగ్ బాస్ రియాలిటీ షోలో సినీ నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. హిందీ బుల్లితెర ఫార్మాట్ లో హౌస్ మేట్ల వ్యవహార శైలితో పలు వివాదాలు చోటుచేసుకుని, అవి తీవ్రమైన పోటీకి దారితీసి, షోతో పాటు మీడియాకు కూడా సెన్సేషన్ గా మారుతాయి. అయితే తెలుగు బిగ్ బాస్ షోలో తొలి వారం పూర్తై రెండో వారం ప్రారంభమైనా హౌస్ మేట్స్ మధ్య చిన్ని చిన్న అపార్థాలే తప్ప పెద్ద వివాదాలు రేగలేదు. సిగిరెట్ల వంకతో బిగ్ బాస్ పై శివబాలాజీ చిందులేయడం, కెప్టెన్ కల్పన మాటలతో తన బాల్యంలో హాస్టల్ గుర్తుకొచ్చిందంటూ ముమైత్ ఖాన్ ఏడుపు, అనారోగ్యం బాధిస్తోందంటూ సంపూర్ణేష్ ఆందోళన మినహా బిగ్ బాస్ లో వివాదం ఏదీ రాలేదు.
అయితే తాజాగా సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ ను తిట్టి బయటకు వచ్చేశాడు. బిగ్ బాస్ షోలో వాతావరణం నచ్చలేదని, తాను ఉండలేకపోతున్నానని ఒక్కసారిగా ఆవేశానికి లోనైన సంపూర్ణేష్ బాబు, షోకి ఒక దండమని, తాను ఇందులో ఇమడలేనని, పల్లె నుంచి వచ్చిన తాను ఒకే ఇంట్లో నాలుగు గోడల మధ్య జీవించలేకపోతున్నానని తెలిపాడు. అయితే నీ ఇష్టప్రకారమే ఈ షోలోకి వచ్చావని బిగ్ బాస్ సర్థి చెప్పినా, సంపూర్ణేష్ బాబు పట్టించుకోలేదు.
దీంతో సంపూర్ణేష్ బాబును బయటకు వచ్చేయమని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే సంపూ బయటకు వచ్చాడా? లేదా అన్నది పూర్తిగా తెలియదు. ఎందుకంటే హిందీ బిగ్ బాస్ షోలో సీక్రెట్ రూంలో కొంత మందిని ఉంచి తరువాత మళ్లీ షోకు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంపూ అభిమానులను నిరాశపరుస్తూ బయటకు వచ్చేశాడా? లేక కుటుంబ సభ్యులను కలిసి, మళ్లీ షోలోకి వస్తాడా? అన్న అనుమానాలు మిగిలిపోయాయి.