: మాజీ రాష్ట్రపతి కలాం గీతాలాపనలో 5 కోట్ల మంది విద్యార్థులు.. గ్రాండ్ మెమోరియల్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కన్నుమూసి రెండేళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ రేపు (గురువారం) రామేశ్వరంలోని ఆయన సమాధి వద్ద ఏర్పాటు చేసిన గ్రాండ్ మెమోరియల్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మూడు నిమిషాల నిడివి ఉన్న ‘కలాం సలాం’ అనే గీతాన్ని ఆలపించనున్నారు. ఈ గీతాలాపనలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ పాడుతూ, ఏకంగా 5 కోట్ల మంది విద్యార్థులు పాలుపంచుకోనుండడం విశేషం.
తమిళంలో ఉన్న ఈ పాటను ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రెండు రోజుల క్రితం చెన్నైలో విడుదల చేశారు. దీనిని ప్రముఖ గీత రచయిత వైరముత్తు రాయగా సిద్ శ్రీరామ్ పాడారు. గిబ్రన్ సంగీత దర్శకత్వం వహించగా వసంత్ సాయి వీడియో దర్శకత్వం వహించారు. దీనిని తెలుగులో సింగింగ్ లెజెండ్ బాలసుబ్రహ్మణ్యం పాడగా హిందీలో ప్రసూన్ జోషి పాడారు.
కలాం గ్రాండ్ మెమోరియల్ ప్రారంభోత్సవం అనంతరం మోదీ ‘సందేశ్ వాహిని విజన్-2020’ రథయాత్రను ప్రారంభించనున్నారు. రామేశ్వరంలో ప్రారంభయ్యే ఈ రథయాత్ర అక్టోబరు 15 రాష్ట్రపతి భవన్ కు చేరుకుంటుంది. ఆ రోజున కలాం 86వ జయంతి.