: సిట్ విచారణకు హాజరవుతున్న వారు మామూలోళ్లు కాదు... సిట్ పరీక్షలకు దొరక్కుండా ఉండేందుకు ఏం చేస్తున్నారో తెలుసా?
శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలని అంటుంటారు. దీనిని సినీ ప్రముఖులు బాగా అన్వయించుకుంటున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. సిట్ విచారణలో డ్రగ్స్ పరీక్షకు దొరకకుండా ఉండేందుకు వివిధ మార్గాలు వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా డ్రగ్ అవశేషాలు దొరక్కుండా ఉండేందుకు అలోవిరా (కలబంద) జ్యూస్ తాగుతున్నారు. ఇది తాగడం వల్ల కడుపు, పేగుల్లోని విషపదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. మరికొందరు డీటాక్సిఫికేషన్ చేయించుకుని వస్తున్నారు. ఈ విధానంలో కడుపులోని రసాయనాలను వైద్యవిధానం ద్వారా బయటకు పంపిస్తారు.
విషాహారం తీసుకున్నప్పుడు, పురుగుల మందులు తాగినప్పుడు వాటి అవశేషాలు లేకుండా ఉండేందుకు ఈ డీటాక్సిఫికేషన్ వినియోగిస్తారు. మరికొందరు చిలేషన్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో కృత్రిమ విధానంలో శరీర ఉష్ణోగ్రతను పెంచుతారు. చెమట ద్వారా శరీరంలోని విషాలు బయటకు వెళ్లిపోయేలా చేస్తారు. మరికొందరు సెలైన్ బాటిళ్ల ద్వారా కొన్ని రకాల రసాయనాలను పంపడం ద్వారా శరీరంలో డ్రగ్ అవశేషాలు బయటకు వెళ్లిపోయేలా చేసి విచారణకు హాజరవుతున్నారు. వెంట్రుకల్లో డ్రగ్ అవశేషాలు దొరక్కుండా ఉండేందుకు ఖరీదైన, ఘాడతగల షాంపూలతో స్నానం చేసి విచారణకు వస్తున్నారు. ఇలాంటి వారి చేతి, కాలి వేలి గోళ్లను సేకరించడం ద్వారా సిట్ అధికారులు డ్రగ్ బాధితులుగా నిరూపించనున్నారు. అలాగే డోపింగ్ మెషీన్ ను కూడా తెప్పించనున్నారు.