: రాష్ట్రపతి కోవింద్ కు వినతులు ప్రారంభం.. తొలి వినతి జస్టిస్ కర్ణన్ దే!
భారత నూతన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు తొలిరోజు నుంచే వినతులు, విన్నపాలు ప్రారంభమయ్యాయి. తొలి విన్నపాన్ని కోల్ కతా హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ కర్ణన్ చేశారు. తన ప్రతినిధి మాథ్యూస్ జె.నెడుంపర ద్వారా ఆయన తన అభ్యర్థనను రాష్ట్రపతికి పంపారు. కోర్టు ధిక్కరణ నేరం కింద కర్ణన్ కు ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించింది.
ఈ నేపథ్యంలో, ఆయనను జూన్ 20వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. భారత న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జైలు శిక్షను అనుభవిస్తున్న తొలి జడ్జి కర్ణనే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, రాజ్యాంగంలోని 72వ అధికరణ ప్రకారం రాష్ట్రపతికి వినతిని అందించినట్టు నెడుంపర తెలిపారు. శిక్షా కాలాన్ని తగ్గించాలని వినతి పత్రంలో కోరినట్టు చెప్పారు. తమ అభ్యర్థనను త్వరలోనే ఆయన పరిశీలిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.