: రాష్ట్రపతిగా తొలి ప్రసంగం చేసిన కోవింద్.. 125 కోట్ల మంది విశ్వాసాన్ని కాపాడుతానన్న రాష్ట్రపతి!
భారతదేశ 14వ రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు సెంట్రల్ హాల్లో తొలి అధికారిక ప్రసంగం చేశారు. దేశ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలుపుకుంటానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 125 కోట్ల మంది విశ్వాసాన్ని కాపాడతానని అన్నారు. పూర్తి గౌరవంతో రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తున్నానని తెలిపారు. రాష్ట్రపతి గౌరవాన్ని నిలిపిన మహానుభావుల అడుగుజాడల్లో నడుస్తానని తెలిపారు. సైనికులు, పోలీసులు, శాస్త్రవేత్తలు, రైతులు.. వీరంతా జాతి నిర్మాతలని ఆయన కొనియాడారు.
మన దేశం ఎంతో గొప్పదని... మన సంస్కృతి ప్రపంచం మొత్తాన్ని ఆకట్టుకుంటోందని అన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం మన దేశానికి సొంతమని తెలిపారు. ఇప్పటి వరకు మనం ఎన్నో సవాళ్లను ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నామని చెప్పారు. ఆదివాసీలు, రైతులు మొదలు... ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యారని అన్నారు. జాతి నిర్మాణంలో యువత, మహిళల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు.
మహాత్మాగాంధీ, దీన్ దయాల్ ఉపాధ్యాయలు కలలుగన్న భారత సమాజాన్ని మనం నిర్మించాలని కోవింద్ పిలుపునిచ్చారు. ఆర్థిక నాయకత్వం, నైతిక ఆదర్శం ఇవ్వగలిగే దేశంగా భారత్ ఎదగాలని అన్నారు. ఈ 21వ శతాబ్దంలో నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ నాంది పలుకుతుందని చెప్పారు. తన ప్రసంగం అనంతరం పార్లమెంటు సెంట్రల్ హాల్లో తొలి వరుసలో కూర్చున్న ప్రముఖులతో ఆయన కరచాలనం చేశారు.