: శశికళకు వీఐపీ ట్రీట్ మెంట్ నిజమే... రూప నివేదిక కరెక్టే!: అసెంబ్లీకి వెల్లడించిన జైలు అధికారులు
కర్ణాటక అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ ముందు హాజరైన బెంగళూరు జైలు సీనియర్ అధికారులు, శశికళకు వీఐపీ ట్రీట్ మెంట్ నిజమేనని, ఈ విషయంలో డీఐజీ రూప నివేదికలో కొన్ని వాస్తవాలు ఉన్నాయని వెల్లడించారు. శశికళతో పాటు కోట్లాది రూపాయల విలువైన స్టాంప్ పేపర్ కుంభకోణంలో ఆరోపణలు వచ్చిన అబ్దుల్ కరీమ్ తెల్గీకి కూడా ప్రత్యేక సదుపాయాలను కల్పించినట్టు అంగీకరించారు.
బీజేపీ ఎమ్మెల్యే, మాజీ హోమ్ మంత్రి ఆర్.అశోక్ అధ్యక్షుడిగా ఉన్న పీఏసీ, 15 రోజుల్లోగా రూప చేసిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించగా, తాజాగా వారు స్వయంగా హాజరై రిపోర్టును ఇచ్చారు. కాగా, ఈ నెల 10న రూప ఇచ్చిన నాలుగు పేజీల నివేదిక కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి ఆమె జైలు జీవితాన్ని గడుపుతుండగా, ప్రత్యేక ఆహారం, వంటగాళ్లు, ప్రత్యేక కిచెన్, ఐదు గదులు, ప్రత్యేక దుస్తులు తదితర ఎన్నో సౌకర్యాలు కల్పించినట్టు పేర్కొన్నారు. తెల్గీకి ప్రత్యేక సదుపాయాల్లో భాగంగా, బాడీ మసాజ్ కోసం నలుగురు ఖైదీలను నియమించినట్టు జైలు అధికారులు తమ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలుస్తోంది.