: సీఎం పళనిస్వామి పక్కన కూర్చునేందుకు పోటీపడ్డ మంత్రి, డిప్యూటీ స్పీకర్!
తమిళనాడు సీఎం పళనిస్వామి పక్కనే తాను కూర్చుంటానంటే తానంటూ డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ గొడవపడిన ఆశ్చర్యకర సంఘటన తిరుప్పూర్ లో జరిగింది. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎం.జి రామచంద్రన్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుప్పూర్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పళనిస్వామి సహా రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్ హాజరయ్యారు.
అయితే.. వేదికపై పళనిస్వామి కూర్చున్న పక్క కుర్చీలో కూర్చునేందుకు రాధాకృష్ణన్, పొల్లాచి జయరామన్ పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో వారి మద్దతుదారులు ఒకరిపై ఒకరు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో, స్వయంగా పళనిస్వామి వచ్చి వారికి సర్దిచెప్పాల్సి వచ్చింది. జయరామన్ ను వేరే కుర్చీలో కూర్చోవాల్సిందిగా పళనిస్వామి కోరడం జరిగింది.