: నాడు మాజీ రాష్ట్రపతి కలాం నివసించిన బంగ్లానే ప్రణబ్ కూ!


ఈ నెల 25తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పదవీ విరమణ అనంతరం, ప్రణబ్ నివాసం ఉండేందుకు ఢిల్లీలోని 10 రాజాజీ రోడ్ లోని ప్రత్యేక బంగ్లాను సిద్ధం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నాడు ఈ బంగ్లాలోనే నివాసం ఉన్నారు. కలాం మృతి తర్వాత ఈ బంగ్లాను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ కు కేటాయించారు. అయితే, ప్రణబ్ ముఖర్జీ పదవీ విరమణ కానున్న నేపథ్యంలో ఆ బంగ్లాను ఆయనకు కేటాయించారు. దీంతో, మహేశ్ శర్మకు వేరే బంగ్లాను కేటాయించారు.

ఇక ఈ ప్రత్యేక బంగ్లాలో మొత్తం ఎనిమిది గదులు ఉన్నాయి. పదవీ విరమణ అనంతరం, ప్రణబ్ ఈ బంగ్లాలో నివాసం ఉండనున్న నేపథ్యంలో కొత్త ఫర్నీచర్ ను ఏర్పాటు చేయడంతో పాటు నేమ్ ప్లేట్లను కూడా మార్చినట్టు సమాచారం. కాగా, 2012లో రాష్ట్రపతిగా ప్రణబ్ ఎన్నికయ్యారు. తన ఐదేళ్ల పదవీకాలం గురించి ప్రణబ్ ఓ పుస్తకం రాసే ఆలోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన అనంతరం, ప్రణబ్ కు పెన్షన్ గా నెలకు రూ.75 వేలు అందుతుంది. రెండు టెలిఫోన్లు, ఒక మొబైల్ ఫోన్, కారు, వైద్యసేవలు ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా, దేశంలో ఎక్కడికైనా ఆయన ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

  • Loading...

More Telugu News