: పబ్బుల్లో డ్రగ్స్ ఎంతో కామన్... కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన నటుడు తరుణ్!
హైదరాబాద్ లోని పబ్బుల్లో మాదక ద్రవ్యాల వాడకం అత్యంత సాధారణమైనదని ఎక్సైజ్ పోలీసుల విచారణలో నటుడు తరుణ్ వెల్లడించాడు. ముఖ్యంగా సెలబ్రిటీలు పబ్ కు వస్తే ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయని తరుణ్ వెల్లడించినట్టు సిట్ వర్గాలు పేర్కొన్నాయి. బాల నటుడిగా సినీ రంగంలోకి ప్రవేశించి, ఆపై సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, ప్రస్తుతం సినిమాలు లేక, పబ్బులు నిర్వహిస్తూ కాలం గడుపుతున్న తరుణ్ ను నిన్న సిట్ పోలీసులు విచారించగా, పలు కీలక విషయాలను, ఆధారాలను వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఈవెంట్ మేనేజర్లు డ్రగ్స్ అందించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారని, నగరంలోని 15 పబ్బుల్లో ఈ దందా సాగుతుందని, సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు వస్తే వారికి ప్రత్యేక గదుల్లో డ్రగ్స్ సరఫరా అవుతాయని, అయితే, తాను మాత్రం ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని, సరఫరా చేయలేదని ఆయన వెల్లడించినట్టు సమాచారం. కాగా, ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ మరో ఇద్దరు డ్రగ్ సరఫరాదారులను శనివారం నాడు అరెస్టు చేసింది. మహ్మద్ ఉస్మాన్ అలియాస్ ఫైజల్ ను అరెస్టు చేసి, అతని వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న 10 గ్రాముల ఎండీఎంఏను, మరో వ్యక్తి అర్నవ్ మండల్ వద్ద 10 గ్రాముల ఎండీఎంఏ, 7 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్ డ్రగ్ ను సిట్ స్వాధీనం చేసుకుంది.