: మత్తులో మునిగిపోయిన సినిమా ప్రపంచం అని చూపిస్తున్నారు: న‌్యూస్ ఛానెళ్లపై మండిపడ్డ వర్మ
సినిమావాళ్లపై న్యూస్ ఛానెళ్లు చెడు ముద్ర వేస్తున్నాయని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మండిపడ్డారు. ప్రస్తుతం ముంబయిలో ఉన్న వర్మ.. ఈ రోజు ఓ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... సినిమావాళ్లు తప్పా ఎవ్వరూ డ్రగ్స్ తీసుకోరన్నట్లు చూపిస్తున్నారని అన్నారు. మత్తులో మునిగిపోయిన సినిమా ప్రపంచం అని చూపిస్తున్నారని మండిపడ్డారు. విచారణ ముగిసిన అనంతరం దాన్ని ఎదుర్కున్న వారు నిజంగానే డ్రగ్స్ తీసుకున్నారా? అనే అంశం బయటపడుతోందని అన్నారు.
ఆబ్కారీ శాఖ కార్యాలయంలో ఏం జరుగుతుందో, అకున్ సబర్వాల్ ఏయే విషయాలు మీడియా ముందు చెబుతున్నారో ఆ విషయాలు మాత్రమే టీవీల్లో చెప్పకుండా, ఇంకా ఎన్నో చెప్పేస్తున్నారని అన్నారు. ఇలా జరిగింది.. అలా జరిగిందని, విచారణలో ఆయా విషయాలపై ప్రశ్నలు అడుగుతున్నారని టీవీల్లో ఇచ్చేస్తున్నారని వర్మ అన్నారు. ప్రశ్న పత్రం లీకైనట్లు న్యూస్ ఛానెళ్లలో ఆ ప్రశ్నలు ఎలా వస్తున్నాయి? గదిలో సినీ ప్రముఖులు చెబుతున్న సమాధానాలు మీడియాకు ఎలా తెలుస్తున్నాయి? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు.