: శశికళను కలిసేందుకు విఫలయత్నం చేస్తున్న దినకరన్... లోపలికి రానివ్వని పోలీసులు!
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళతో ములాఖాత్ కు ఆమె మేనల్లుడు టి.టి.వి.దినకరన్ విఫలయత్నం చేస్తున్నారు. సెంట్రల్ జైలులో ప్రత్యేకంగా వంటగది, ఇతర సౌకర్యాలను అనుభవిస్తూ శశికళ జైలు శిక్షను హాలీడే ట్రిప్ లా ఎంజాయ్ చేస్తున్నారన్న నివేదిక నేపథ్యంలో జైళ్ల శాఖ విచారణ జరుపుతోంది.
ఈ నేపథ్యంలో నిన్న మెన్నటి వరకు రాచమర్యాదలతో జైలులోపలికి ప్రవేశించే దినకరన్ కు ఇప్పుడు ఆమెను పరామర్శించే భాగ్యం కలగలేదు. నేటి ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు దినకరన్ కు సూచించారు. అయితే విచారణ నేపథ్యంలో నేడైనా ఆమె దర్శనభాగ్యం కలుగుతుందని చెప్పలేమని వారు చెప్పారు. దీంతో దినకరన్ కు అత్తను కలిసే భాగ్యం నేడైనా దక్కుతుందో? లేదో?నని అన్నాడీఎంకే వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.