: నడిరోడ్డుపై దారుణం.. 11 మంది కలసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన వైనం.. సీసీకెమెరాలో రికార్డు
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దాదాపు 11 మంది వ్యక్తులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రఫీఖుద్దీన్ అనే వ్యక్తి రోడ్డుపక్కనే ఉన్న దుకాణంలో టీ తాగుతున్నాడు. అదే సమయంలో అక్కడకు కత్తులు, కర్రలతో వచ్చిన కొందరు వ్యక్తులు అతడిపై ఒక్కసారిగా దాడి చేశారు. దుకాణంలోంచి అతడిని బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేశారు.
వారి బారి నుంచి అతడు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతడి శరీరంపై 27 కత్తిపోట్లు పడ్డాయి. అతడిని చంపిన తరువాత నిందితులంతా బైక్‌లపై అక్కడి నుంచి పారిపోయారు. గతంలో మృతుడు రఫీఖుద్దీన్ పై 30 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.