: అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడం తప్పట... చితక్కొట్టిన యువకులు.. యూపీలో దారుణ ఘటన!
దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా మారుమూల ప్రాంతాల్లో ఇంకా నైతికత, సామాజిక కట్టుబాట్లు, కులాలు, మతాలు అంటూ ఏదో ఒక అమానుష ఘటన జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. మహారాజ్‌గంజ్ ప్రాంతంలో ఓ బాలుడు, బాలిక కలిసి మాట్లాడుకుంటుండగా కొందరు యువకులు వారిని అడ్డుకుని, విచక్షణా రహితంగా కొట్టి హింసించారు.
బాలిక దళిత కుటుంబానికి చెందినది కావడమే ఇందుకు కారణం. అంతేకాకుండా వాళ్లను కొడుతున్న దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి ఇంటర్నెట్‌లో కూడా పెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇంటర్నెట్‌లో వీడియో పెట్టడం వల్ల ఈ అమానుష ఘటనపై స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా నిందితులను పట్టుకొని శిక్ష పడేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.