: ఓపక్క ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు ... మరోపక్క గిటార్ వాయించిన పేషెంట్!
వైద్యులు ఎంతో సీరియస్‌గా ఆపరేషన్ చేస్తుంటే గిటార్ వాయిస్తూ పేషెంట్ వారికి సహాయం చేశాడు. అదెలాగంటారా? గిటార్ వాయించడం కూడా సర్జరీలో భాగమే మరి! రెండేళ్లుగా గిటార్ వాయిస్తుండటం వల్ల బెంగళూరుకి చెందిన ఈ మ్యుజీషియన్ చేతి వేళ్లు బిగుసుకుపోవడంతో గిటార్ వాయించడం ఇబ్బందిగా మారింది. చేతి కండరాలు ఇలా బిగుసుకు పోవడానికి అతని మెదడులో ఏర్పడిన అసంకల్పిత తరంగాలే కారణమని, వాటిని నాశనం చేస్తే కండరాలు మామూలుగా పనిచేస్తాయని వైద్యులు కనిపెట్టారు. ఈ నేపథ్యంలో అతని మెదడుకు ఆపరేషన్ చేయడం ప్రారంభించారు. ఆ అసంకల్పిత తరంగాలు ఎక్కడి నుంచి జనిస్తున్నాయో తెలుసుకోవడం కోసం వారే స్వయంగా పేషెంట్‌కు గిటార్ వాయించమని చెప్పారు. బిగుసుకు పోయిన వేళ్లతో పేషెంట్ గిటార్ వాయిస్తుండగా ఆ తరంగాల జాడ కనిపెట్టి, ఎలక్ట్రిక్ షాక్ ద్వారా ఆ ప్రాంతాలను నాశనం చేశారు. ఏడు గంటల పాటు సాగిన ఈ సర్జరీ విజయవంతం కావడంతో అతని వేళ్లు తిరిగి మామూలుగా పనిచేస్తున్నాయని డాక్టర్ శ్రవణ్ శ్రీనివాసన్ తెలిపారు.