: నాకు నిధులు ఇవ్వడం లేదు.. సొంత ఖర్చులతో తిరుగుతున్నాను!: నన్నపనేని రాజకుమారి సంచలన ఆరోపణ
ఆంధ్ర ప్రదేశ్ లో మహిళా కమిషన్ కు నిధుల కేటాయింపులో తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మధ్యాహ్నం విశాఖపట్నంలో మాట్లాడిన ఆమె, 16 నెలలుగా తనకు టీఏ, డీఏలు ఇవ్వడం లేదని వాపోయారు. ఎక్కడ పర్యటించాల్సి వచ్చినా తన సొంత ఖర్చుతోనే వెళుతున్నానని, మహిళా సమస్యల పరిష్కారానికి తన చేతనైనంత సాయం చేస్తున్నానని చెప్పారు.
బాధిత మహిళలకు తన సొంత డబ్బుల నుంచి రూ. 5 వేలో, రూ. 10 వేలో ఇస్తున్నట్టు తెలిపారు. అంతకుమించి తానేమీ సాయపడలేక పోతున్నానని అన్నారు. సమస్యలపై త్వరలోనే సీఎంతో చర్చిస్తానని, మహిళా కమిషన్ కు నిధులను అందించాలని చంద్రబాబును కోరుతానని నన్నపనేని వ్యాఖ్యానించారు.