: శశికళ వివాదంలో 32 మంది ఖైదీలకు నరకం చూపించిన జైలు అధికారులు... మానవ హక్కుల సంఘం నోటీసులు
పరప్పన అగ్రహారం జైళ్లో 32 మంది ఖైదీలను కొట్టి, రాత్రికి రాత్రి వేరే జైళ్లకు తరలించినట్లు వస్తున్న ఆరోపణల విషయంలో సంజాయిషీ ఇవ్వాలని జైలు అధికారులకు మానవ హక్కుల సంఘం నోటీసులు పంపించింది. మాజీ జైళ్ల డీఐజీ డి. రూపతో మాట్లాడేందుకు జైలు పరిసరాల్లో వారు ధర్నా నిర్వహించారనే నెపంతో ఖైదీలను శారీరకంగా హింసించి, మైసూర్, బెల్గాం, బళ్లారి జైళ్లకు తరలించారని, వారి కుటుంబ సభ్యులకు కూడా కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని బీజేపీ ఎంపీ శోభా కరండ్లాజే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఈ ఆరోపణలపై నాలుగు రోజుల్లో స్పందన ఇవ్వాలని, ఖైదీల స్థానచలనానికి సంబంధించిన వివరాలతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిని కూడా వివరంగా తెలియజేయాలని కర్ణాటక జైళ్ల శాఖ డీజీపీ, ఐజీలకు మానవ హక్కుల సంఘం నోటీసులు జారీచేసింది. పరప్పన అగ్రహరం జైల్లో అన్నాడీఎంకే నేత శశికళకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తూ ఇతర ఖైదీలకు నాణ్యత లేని సౌకర్యాలు కల్పించడంపై తన రిపోర్టును మాజీ జైళ్ల డీజీపీ డి. రూప మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వృత్తి నియమాలు ఉల్లంఘించారంటూ ఆమెను, జైళ్ల శాఖ డీజీని కర్ణాటక ప్రభుత్వం బదిలీ చేసింది.