: కేంద్రమంత్రి పదవికి వెంకయ్య రాజీనామా.. నేడు ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్
అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవి బరిలోకి వచ్చిన వెంకయ్యనాయుడు సోమవారం రాత్రి పొద్దుపోయాక కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. సోమవారం హస్తినలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్డీయే పక్షాల తరపున వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి పోటీ చేయనున్నారని ఆదివారం రాత్రి నుంచే వార్తలు హల్చల్ చేశాయి. అయితే వెంకయ్య ఆ వార్తలను ఖండించారు. అయితే, సోమవారం ఢిల్లీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు అత్యవసర సమావేశం అనంతరం వెంకయ్యను ఎన్డీయే పక్షాల తరపున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో రాత్రి ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా సమర్పించనున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ బీజేపీ తనకు తల్లి వంటిదని, ఇప్పుడు అమ్మను వదిలేస్తున్న బాధ కలుగుతోందని అన్నారు. కాగా, వెంకయ్య నాయుడు నేడు (మంగళవారం) ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.