: 24 గంటల్లో ఇల్లు కట్టాలన్న టార్గెట్ పూర్తి కాలేదు... రికార్డు దక్కలేదు!
బెంగళూరుకు చెందిన ఓ నిర్మాణ సంస్థ తలపెట్టిన '24 గంటల్లో ఇంటి నిర్మాణం' రికార్డును పూర్తి చేయలేకపోయింది. ఒక్క రోజులో మూడు బెడ్ రూముల ఇంటిని నిర్మించి రికార్డును నెలకొల్పాలని సంస్థ చేసిన ప్రయత్నం విఫలమైంది. గడువులోగా 80 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. టీ-అగాపుర ప్రాంతంలోని స్టోన్ హిల్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణాన్ని 'రీబెల్' అనే సంస్థ తలపెట్టిన సంగతి తెలిసిందే.
"వాతావరణం సహకరించనందునే అనుకున్న సమయంలో ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయాము. 20 మంది లక్ష్యాన్ని చేరాలని ఎంతో శ్రమించారు. మరోసారి ప్రయత్నించి రికార్డును సాధిస్తామన్న నమ్మకం ఉంది" అని ప్రాజెక్టు చీఫ్ పాడీ మీనన్ వెల్లడించారు. తమ ప్రయత్నం ఇప్పటికి లిమ్కా బుక్ రికార్డుల్లోకి ఎక్కలేకపోయిందని తెలిపారు. అసాధ్యమని భావించే ఫీట్ ను తాము చేసి చూపాలని భావించామని, ఆ దిశగా 90 శాతం విజయం సాధించామని, పునాదులు, గోడలు వంటి పనులన్నీ పూర్తయ్యాయని, సీలింగ్ మాత్రమే మిగిలిపోయిందని ఆయన అన్నారు.