: 'బాధితురాలి పేరు దాచకూడదు' అన్న కమల్ వ్యాఖ్యలపై గౌతమి స్పందన!
మలయాళ నటి అపహరణ కేసులో ప్రముఖ నటుడు దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల విలక్షణ నటుడు కమలహాసన్ మాట్లాడుతూ, బాధితురాలి పేరును దాచకూడదని వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలపై నటి గౌతమి స్పందించారు. బాధితురాలి పేరును దాచకూడదని... కానీ, చట్టం దానికి ఒప్పుకోదని అన్నారు. బాధితురాలు అనే పదం వాడటానికి తాను కూడా సిగ్గుపడుతున్నానని... దారుణమైన ఘటనల్ని ఎదుర్కొన్న ఓ మహిళ, న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు, ఆమె పేరును దాచాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. తన దృష్టిలో బాధితురాలు ఓ హీరో అని చెప్పారు. బాధితురాలు ఈ సమాజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, తన ముఖాన్ని సమాజానికి చూపించాలని, అయితే, దీనికి ఎంతో ధైర్యం కావాలని అన్నారు.