: లోకేష్ ను ఎందుకు కలవాల్సి వచ్చిందో వెల్లడించిన వైకాపా ఎంపీ బుట్టా రేణుక
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హోదాలో ఉన్న నారా లోకేశ్ ను అభివృద్ధి పనుల విషయంగానే తాను కలిశానే తప్ప, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని వైకాపా ఎంపీ బుట్టా రేణుక వ్యాఖ్యానించారు. తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచన ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేసిన ఆమె, పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాలేకపోతున్నట్టు ముందుగానే సమాచారం ఇచ్చానని స్పష్టం చేశారు. తన స్వగ్రామంలో తెలుగుదేశం పార్టీ వారు వైకాపాలో చేరుతున్నందున, వారికి స్వాగతం పలికే కార్యక్రమంలో బిజీగా ఉండిపోయానని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల నిమిత్తం లోకేశ్ ను కలవాల్సి వచ్చిందని వెల్లడించారు. తాను పార్టీ మారనున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు ఎంతమాత్రమూ లేవని అన్నారు.