: నేటి విచారణలో మరిన్ని కీలక వివరాలు, కొత్త పేర్లు చెప్పిన కెల్విన్.. జాబితాలో యంగ్ హీరోయిన్ల పేర్లు కూడా!
టాలీవుడ్ డ్రగ్స్ దందాలో తొలి నిందితుడిగా ఉన్న కెల్విన్, నేటి విచారణలో మరిన్ని వివరాలను వెల్లడించినట్టు సమాచారం. తొలి జాబితాలో భాగంగా నోటీసులు పంపి వారిని విచారించక ముందే, సిట్ రెండో జాబితాను తయారు చేసుకోగా, ఇప్పుడు కెల్విన్ చెప్పిన వివరాలతో మూడో జాబితా కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తాజా జాబితాలో గత నాలుగైదేళ్లుగా రాణిస్తున్న యంగ్ హీరోయిన్స్ పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారితో పాటు పలువురు రాజకీయ నాయకుల పుత్ర రత్నాలు, హై ప్రొఫైల్ ప్రముఖులు, పేజ్ - 3 సెలబ్రిటీల పేర్లు వెల్లడైనట్టు సిట్ వర్గాలు చెబుతున్నాయి.
కాగా, నేటితో కెల్విన్ పోలీసు కస్టడీ ముగియనుండగా, అతన్నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి వున్నందున కస్టడీ పొడిగింపును కోరుతూ రేపు సిట్ బృందం కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. కెల్విన్ తో పాటు, అతని వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్న వారందరినీ మరింత లోతుగా విచారించిన మీదటే ముందడుగు వేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు.